అమరావతి, sbstv న్యూస్ ప్రతినిధి : ‘
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 6వతేదీ నుండి వచ్చే జనవరి 8వ తేదీ వరకూ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఒక సర్కులర్ ఉత్తర్వుల ద్వారా తెలియజేశారు.
గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే ప్రాథమిక ఉద్దేశ్యంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని పేర్కొన్నారు.ఈసదస్సుల సందర్భంగా సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శించి ఫ్రీహోల్డ్ మరియు సెక్షన్ 22A కు సంబంధించిన భూఆక్రమణ సమస్యలతో ప్రభావితమైన వారి నుండి ముందస్తు సమాచారంతో వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు.జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ జిల్లా షెడ్యూల్‌ను ఖరారు చేసి,గ్రామ,మండల స్థాయి పిటిషన్ల స్వీకరణ,పరిష్కార విధానాన్ని పర్యవేక్షించి సకాలంలో ఆయా ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
రెవెన్యూ సదస్సుల సందర్భంగా స్వీకరించే ఫిర్యాదులన్నిటినీ రియల్ టైమ్ గవర్నెస్ సొసైటీ(RTGS) రూపొందించిన గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్‌లోని ప్రత్యేక విండోలో ఆన్లైన్లో పొందుపర్చి ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.షెడ్యూల్ ప్రకారం,రెవెన్యూ సదస్సులు ప్రతి రోజు ఉదయం 9.00 గంటలకు రెవెన్యూ గ్రామంలో నిర్దేశించిన ప్రదేశంలో నిర్వహించాలని సిసోడియా తెలిపారు.
ఈనెల 6వతేదీన రెవెన్యూ సదస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంతో మొదలై జవనరి 8వతేదీ వరకు నిర్వహించబడతాయని సిసోడియా వెల్లడించారు.ఈరెవెన్యూ సదస్సులకు జాయింట్ కలెక్టర్‌ను సమన్వయకర్తగా ఉంటారని,సబ్ కలెక్టర్లు,రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లను వారి వారి డివిజన్ల్లో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఈనెల 5వతేదీ లోగా షెడ్యూల్ ఖరారు చేసే విధంగా జిల్లా కలక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా చిన్న రెవెన్యూ గ్రామాలకు ఒకపూటలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు తగినంత కూర్చోగలిగే సామర్థ్యం ఉన్న సరైన ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని చెప్పారు.రెవెన్యూ సదస్సుల గురించి ప్రజలకు తెలియ జేయడానికి స్థానిక మీడియాను ఉపయోగించి విస్తృత అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. ఈసమావేశాల ఉద్దేశ్యం,సదస్సులు జరిగే తేదీలు,వేదిక వివరాలతో కూడిన కరపత్రాలు మరియు పోస్టర్లను అన్ని గ్రామ పంచాయతీల్లో పంపిణీ చేయాలని కలక్టర్లను ఆదేశించారు.రెవెన్యూ సదస్సుల తేదీ మరియు స్థలాన్ని టాం-టాం ద్వారా గ్రామస్తులకు తెలియజేయాలని గ్రామ పంచాయతీ కార్యాలయం,పాఠశాల,గ్రామ సంస్థ కార్యాలయం,ఐకెపి,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రదర్శించాలని తెలిపారు.
తహసీల్దార్,రెవెన్యూఇన్స్పెక్టర్,సంబంధిత గ్రామాల వి.ఆర్.ఓ,మండల సర్వేయర్,రిజిస్ట్రేషన్ శాఖప్రతినిధి,అవసరమైన చోట్ల అటవీ,దేవాదాయ శాఖ,వక్ఫ్ బోర్డు సిబ్బందితో కూడిన ఈఅధికార బృందాలు ఆయా గ్రామాల సందర్శన గురించి గ్రామస్తులకు ముందస్తుగా తెలియజేసి విస్తృత ప్రచారం చేయాలని సిసోడియా జిల్లా కలక్టర్లను ఆదేశించారు.జిల్లా స్థాయి అధికారులను మండల నోడల్ అధికారులుగా నియమించి వారి ఆధ్వర్యంలో ఈరెవెన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా జిల్లా కలక్టర్లను ఆదేశించారు.