డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి :
కొత్తపేట : అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తం ఇచ్చేవారు ప్రాణదాతలని పోలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక RS BC కన్వెన్షన్ హాల్ లో మంగళవారం జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ మట్టపర్తి జితేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్న అని పెద్దలు పేర్కొన్నారని, అయితే రక్తదానమే మిన్న అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. పాత్రికేయునిగా జితేంద్ర వ్యవహరిస్తూ జితేంద్ర సేవా ఫౌండేషన్ ను స్థాపించి ఇలాంటి బృహత్కార్యాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. గతంలో జితేంద్ర పెద్ద ఎత్తున బాలోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జయప్రదం చేయడం తెలిసిందేనన్నారు. ఈ సందర్భంగా అమలాపురానికి చెందిన సహస్ర బ్లడ్ బ్యాంక్ వారిని అభినందించారు.అలాగే రక్తదాన శిబిరానికి తమ కళాశాలలైన సిద్దార్థ, శతాబ్ది విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. అందులోనూ విద్యార్థినిలు ముందుకు వచ్చి రక్తం దానంచేయడం అభినందనీయం అన్నారు. దానికి కళాశాల ప్రిన్సిపాల్ కె.నాగమోహన్, ఎవో రెడ్డి సత్యనారాయణలను అభినందించారు. మరొక అతిథి రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పలువురి ప్రాణాలను రక్షించే ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు అన్నారు. దీనిపై జితేంద్రసేవా ఫౌండేషన్ చైర్మన్ జితేంద్రను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమానికి విచ్చేసిన వాసంశెట్టి సత్య, పితాని భానుచందర్, కముజు వెంకటేశ్వరరావు,ఆరుమిల్లి సాయిబాబాలను ఆర్.ఎస్ ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జితేంద్ర సేవా ఫౌండేషన్ ప్రతినిధులు జోగి మురళీ కృష్ణ,రాయుడు దుర్గా ప్రసాద్, సంసాని సునీల్ కుమార్, సహస్ర బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కడలి శ్రీహరి మాజీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మట్టపర్తి సూర్యచంద్రరావు,తోట వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.