ఉచిత ఇసుక నిర్వహణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు సర్వసన్నద్ధం కావాలన్నా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్


రావులపాలెం : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక నిర్వహణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు సర్వసన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. శనివారం రావులపాలెంమండల పరిధిలోని ఊబలంక ఇసుక రీచును ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నీరు తగ్గిన పిదప ఇసుక తవ్వకాలకు చర్యలు చేపడుతూ పార దర్శకంగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక లభ్యత, వాహనాలు సరఫరా ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఇసుక బుకింగ్ వాహనాల బుకింగ్ ప్రక్రియలపై ఇసుక రీచ్ నిర్వహణ సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. అన్ని అంశాలపై పూర్తిగా అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎటువంటి అపోహలకు తావు లేకుండా నిర్వహించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనన్నారు. ఇసుక రీచ్ సరిహద్దులను మ్యాపులు ఆధారంగా ఆయన గుర్తించి ఇసుక ర్యాంపు నిర్వహణపై తగు సూచనలు సలహాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీకర్, జిల్లా గనులు భూగర్భశాఖ అధికారి అశోక్ కుమార్, రియాల్టీ ఇన్స్పెక్టర్ సుజాత, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.