మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసిందన్న కలెక్టర్ మహేష్ కుమార్ .


 డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి:
జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి లక్కీ డ్రా ప్రక్రియను దరఖాస్తుదారుల సమక్షంలో రెవెన్యూ, ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారులు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన లక్కీ డ్రా ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి లక్కీ డ్రా ప్రక్రియను నిర్వహించారు.కౌంటర్ 1  వద్ద అమలాపురం, కొత్తపేట ముమ్మిడివరం సర్కిల్ లకు సంబంధించి లక్కీ డ్రా లాటరీ ప్రక్రియ నిర్వహించగా, కౌంటర్-2 వద్ద రాజోలు ఆలమూరు రామచంద్రపురం సర్కిల్ లకు లక్కీ డ్రా ప్రక్రియను నిర్వహించారు. ప్రశాంతంగా నిర్వహించిన మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన మద్యం షాపుల విధానం ప్రకారం 2024 - 26 సంవత్సరమునకు గాను  జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రక్రియ దరఖాస్తుదారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో పూర్తిచేయడం జరిగిందన్నారు. రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి రెండు కౌంటర్ల వద్ద వీడియో గ్రాఫర్లతో పూర్తి ప్రక్రియను వీడియోగ్రఫీ చిత్రీకరించినట్లు తెలిపారు.  జిల్లాలోని 133 మద్యం దుకాణాలకు 4087  దరఖాస్తులు దాఖలు చేయగా ,133 మద్యం షాపులకు లక్కీ డ్రా ద్వారా 133 మందిని ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ ప్రసాద్, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.