Sbstv న్యూస్ కోనసీమ ప్రతినిధి వి శ్రీనివాసు: ఎందరో నాయకులు, అమరవీరులు , స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు అమలాపురం కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కలెక్టరేట్లోని మహాత్మా గాంధీ ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మువ్వన్నెల జెండా ఆవిష్కరించి, జెండా గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ .. ఎందరో నాయకులు అమరవీరులు, స్వా తంత్ర్య సమరయోధుల పోరాటాల ఫలితంగా బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది భారతావనికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. స్వాతంత్రం లభించిన నాటి నుంచి దేశాన్ని సంక్షేమం అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లేందుకు నాయకుల కృషి ఎనలేనిది అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రెండవ కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందని రానున్న రోజుల్లో జిల్లా లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుచేస్తూ జిల్లా అన్ని రంగాల్లో పురోగమించే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన చిన్నారులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాంతి జిల్లా రెవెన్యూ అధికారి యం వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.