sbs tv కోనసీమ ప్రతినిధి: గోదావరి వరదల మూలంగా నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటల నష్ట పరిహారాల అంచనా గణనను ఈనెల నాలుగో తేదీ లోపు పూర్తి చేసి సోషల్ ఆడిట్ నిమిత్తం రైతు సేవా కేంద్రాలను ప్రదర్శించి గ్రీవెన్స్ లను రైతుల నుండి సేకరిస్తూ సమగ్రమైన నివేదికను ఈనెల 10వ తేదీ నాటికి జిల్లా యంత్రాంగానికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుండి మండల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గోదావరి వరదలు అనంతరం ముంపు ప్రభావిత ఆవాసాలలో చేపట్టాల్సిన పారిశుద్ధ్యం, వైద్య సేవలు, సురక్షిత త్రాగునీరు సరఫరా, డ్రైనేజీలలో ఉన్న మురుగు నీరును అవుట్ ఫాల్స్ స్లూయిజ్ గేట్లు తెరిచి దిగువకు విడుదల చేయడం, వ్యవసాయ ఉద్యాన పంట నష్టాల గణన ఆoశాలపై మండల స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరద పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత ప్రస్తుతం చివరి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించు కోవడం జరిగిందని కావున ముంపు ప్రభావిత ఆవాసాలలో పారిశుద్ధ్య ప్రక్రియను సమగ్రంగా నిర్వహిస్తూ బురద చేరిన ప్రాంతాలలోని బురదను తొలగించి బ్లీచింగ్ చేస్తూ అంటూ ప్రబలకుండా క్రిమి కీటకాలు వ్యాప్తికి ఆస్కారం లేకుండా క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారి చేస్తూ సాయంత్రం వేళలో పాగింగ్ చేపడుతూ దోమల వ్యాప్తిని నివారించాలని సూచించారు.గ్రామపంచాయతీ సిబ్బంది ఎంపీడీవోలు పారిశుధ్యం పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముంపు బాధితుల ఆరోగ్య భద్రతకై చర్యలు చేపట్టడంతో పాటుగా నీటి ద్వారా సంక్రమించే డయేరియా జ్వరాలు, తదితర వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ సకాలంలో అవసరమైన ఔషధాలు అందించి అనారోగ్య పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దాలని ఆదేశించారు. పాము కాటు నివారణ ఔషధాలను సాధారణ ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలన్నారు. కాచి చల్లార్చిన నీరు త్రాగడం వల్ల చాలా వరకు వ్యాధులు సంక్రమించవని ఆ దిశగా ముంపు ప్రభావిత ప్రాంతాలలో అవగాహన పెంపొందించాలని సూచించారు. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం వారు సిపిడ బ్ల్యూఎస్ స్కీముల వద్ద ఓహెచ్ఎస్ఆర్లో బ్లీచింగ్ క్లోరినేషన్ ప్రక్రియలు సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా పైప్ లైన్ వాల్వులు ,తదితర త్రాగునీటి సరఫరా వ్యవస్థలను క్లోరినేషన్ తో శుద్ధి చేయాలని సూచించారు. జలవనరులు డ్రైనేజీ విభాగపు ఇంజనీర్లు డ్రైనేజీలలో ఉన్న మురుగనీరును అవుట్ ఫాల్స్ స్లూయిస్ ద్వారా దిగువకు విడుదల చేయాలన్నారు. ఉద్యాన పంటలు సుమారు 14 మండలాలలో ముంపు బారిన పడ్డాయని 33% పైబడి పంట నష్టాలు సంభవించిన వాటిని మాత్రమే మార్గదర్శకాలు అనుగుణంగా రూపొందించాల న్నారు. వరద ప్రభావిత మండలాలకు నియమించిన ప్రత్యేక అధికారులు పారిశుద్ధ్యం ,వైద్య సేవలు ,పంట నష్టాల గణన త్రాగునీటి సరఫరా వ్యవస్థలలో ప్రస్తుతం చేపడుతున్న పనులను నిశితంగా పర్యవేక్షించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతీ, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.